కఠిన చట్టాలతో డీప్ ఫేక్ కు చెక్..రూపకల్పనకు చర్చలు జరుపుతున్నం

కఠిన చట్టాలతో డీప్ ఫేక్ కు చెక్..రూపకల్పనకు చర్చలు జరుపుతున్నం
  • ఏఐ సమిట్​లో తొలిరోజు గందరగోళంపై కేంద్ర మంత్రి సారీ: అశ్వినీ వైష్ణవ్
  • సమిట్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • మొదటిరోజునే భారీగా రద్దీ.. ఏర్పాట్లు లేక జనం ఇబ్బందులు

న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీ రాకతో డీప్ ఫేక్​ల సమస్య వేగంగా పెరుగుతోందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ ల సమస్య నుంచి పిల్లలను, సమాజాన్ని కాపాడుకోవాలంటే మరింత కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ఇండస్ట్రీ వర్గాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.

ఇప్పటికే పాటిస్తున్న రక్షణ చర్యలకు అదనంగా మరిన్ని చర్యలు చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్2026’ వేదికగా ఆయన మంగళవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. డీప్ ఫేక్​లను కట్టడి చేసే అంశంపై సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు.

నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలన్నీ భారత రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియా డేటా వినియోగంలో ఏజ్ ఆధారితంగా ఆంక్షలు విధించడాన్ని ఇప్పటికే అనేక దేశాలు అమలు చేస్తున్నాయని వైష్ణవ్ తెలిపారు. దీనివల్ల స్టూడెంట్లు, యువత, పిల్లలు.. ఇలా ఆయా వయసుల వారీగా ఎవరికి సరిపోయే కంటెంట్ వారికి అందుబాటులో ఉంటుందన్నారు. 

కేంద్ర మంత్రి క్షమాపణలు.. 

భారత్ మండపంలో ఏఐ సమిట్ తొలిరోజు సోమవారం ఎదురైన ఇబ్బందులపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. సమిట్ కు అనూహ్యంగా సందర్శకులు తరలి వచ్చారని, మొదటిరోజే 70 వేలకుపైగా మంది హాజరవ్వడంతో ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమిట్ ను తాము నిర్వహిస్తున్నామని, దీనికి మంచి స్పందన వస్తోందని అన్నారు.

ఢిల్లీలోని భారత్ మండపంలో 5 రోజుల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సోమవారం ప్రారంభమైంది. అయితే, తొలిరోజే భారీ ఎత్తున సందర్శకులు రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రతా తనిఖీల్లో జాప్యం, ఎంట్రీల వద్ద పొడవైన క్యూ లైన్లతో జనం అవస్థలు పడ్డారు. దీంతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం క్షమాపణలు చెప్పారు. సమిట్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఏఐ సమిట్​కు భారత్ మండపంతోపాటు పరిసర ప్రాంతాల్లో 4 వేలకుపైగా సర్వైలెన్స్ కెమెరాలతోపాటు ఎన్ఎస్​జీ, సీఐఎఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, పోలీసులతో సహా 15 వేల మంది బలగాలను మోహరించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఏఐ సమిట్ లో దొంగలుపడ్డారు! 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్​లో తొలిరోజు దొంగలుపడ్డారు. సమిట్​లో తమ స్టాల్ నుంచి పేటెంట్ పొందిన ఏఐ వేరబుల్స్ ప్రొడక్టులను చోరీ చేశారంటూ బెంగళూరుకు చెందిన నియోసేపియన్ స్టార్టప్ సీఈవో ధనంజయ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టడంతో కలకలం రేగింది. హైసెక్యూరిటీ జోన్ లో కేవలం భద్రతా సిబ్బంది, అధికారులే ఉన్నా.. దొంగతనం జరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

 బిల్ గేట్స్ హాజరు..

సమిట్​కు బిల్ గేట్స్ హాజరుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేశాయి. ఎప్ స్టీన్ ఫైల్స్​లో బిల్ గేట్స్ పేరు వచ్చిన నేపథ్యంలోనే ఆయనను షెడ్యూల్ లిస్ట్ నుంచి కేంద్రం తొలగించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ గురువారం నాడు ఏఐ సమిట్​కు హాజరవుతారనిగేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.

హ్యూమనాయిడ్ రోబోల ప్రదర్శన

సమిట్​లో హ్యూమనాయిడ్ రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టెక్ దిగ్గజం క్వాల్ కమ్ తన రోబోటిక్స్ సిస్టమ్​ను ప్రదర్శించింది. ఇంటి పనులు చేసే రోబోలు, ఇండస్ట్రియల్ రోబోలు, పెద్ద సైజు హ్యూమనాయిడ్ రోబోలు ఈ ప్రదర్శనలో స్పెషల్ అట్రాక్షన్​గా మారాయి. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఏఐ టెక్నాలజీని కలిపి ఒకే సిస్టమ్​లో కలిపి రూపొందించిన ఫిజికల్ ఏఐ టెక్నాలజీని క్వాల్ కమ్ పరిచయం చేసింది. హ్యూమనాయిడ్ రోబోలు రూపంలో ఉండటమే కాకుండా..చూడటం, వినటం, నిర్ణయాలు తీసుకోవటం, పరిస్థితికి తగ్గట్లు స్పందించడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. 

ఏఐ సమిట్ లో ‘ఓన్లీ క్యాష్.. నో యూపీఐ’!   

ఏఐ టెక్నాలజీ ప్రధానాంశంగా హైటెక్, డిజిటల్ హంగులతో జరుగుతున్న ఏఐ సమిట్ లో డిజిటల్ చెల్లింపులకు చాన్స్ లేకపోవడం, ఫుడ్ కౌంటర్ల వద్ద కేవలం క్యాష్ మాత్రమే తీసుకోవడం పట్ల సందర్శకులు టెక్ నిపుణులు విస్తుపోయారు. డిజిటల్ ఇండియా పేరుతో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమిట్ లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల వంటి డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేకపోవడం ఏమిటంటూ పెదవివిరిచారు. సమిట్ లో వైఫై సౌకర్యం కూడా లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తికి గురయ్యారు.